ఆ విద్యార్థి చదువుతోంది 8వ తరగతి… వయస్సు 13 ఏళ్లు… సహజంగా ఏ పిల్లలైనా ఆ వయస్సులో రోజంతా చదవడం, సాయంత్రం కాసేపు ఆటలాడుకోవడం చేస్తారు. అయితే ఆ విద్యార్థి మాత్రం అలా కాదు. రోజూ ఆడే ఆటలు బోర్ కొట్టాయో ఏమో గానీ తానే సొంతంగా ఆటల్ని క్రియేట్ చేసేశాడు. అదీ గ్రౌండ్‌లో ఆడుకునే ఆటలు కాదు, ఆ పిల్లాడు క్రియేట్ చేసింది స్మార్ట్‌ఫోన్‌లో ఆడుకునే ఆటల్ని. అవును, మీరు విన్నది నిజమే. షాకింగ్ ఉన్నా ఆ పిల్లాడు చేసింది మాత్రం అద్భుతమే. ఇంకా హై స్కూల్ కూడా దాటని విద్యార్థి ఏకంగా స్మార్ట్‌ఫోన్ గేమ్స్‌నే క్రియేట్ చేశాడంటే ఆశ్చర్యమే కదా. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లు, కోడింగ్, సాఫ్ట్‌వేర్ ప్యాకేజీలు తదితర అంశాల్లో పట్టు ఉంటే గానీ ఎవరూ ఇలా చేయలేరు. అలాంటి ఓ స్కూల్ విద్యార్థి చేశాడంటే నిజంగా అతని ప్రతిభ అమోఘమనే చెప్పవచ్చు.
అతని పేరు విష్ణుచందన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా కావలిలో నివాసం. అతని తండ్రి పేరు కొలపర్తి పవన్. పవన్ వృత్తి రీత్యాం కంప్యూటర్ మెకానిక్. సర్వీసింగ్‌లు చేయడం, సాఫ్ట్‌వేర్‌లు ఇన్‌స్టాల్ చేయడం అతని పని. అయితే ఇంట్లో కంప్యూటర్ ఉండడంతో విష్ణుకు చిన్నప్పటి నుంచి కంప్యూటర్‌పై ఆసక్తి పెరిగింది. దీంతో తన 3వ ఏట నుంచి కంప్యూటర్లలో గేమ్స్ ఆడేవాడు. 5వ ఏటకు రాగానే 1వ తరగతిలో కంప్యూటర్లలో వాడే పలు సాఫ్ట్‌వేర్ల గురించి ఎప్పటి కప్పుడు తండ్రిని అడిగి తెలుసుకునే వాడు. దీంతోపాటు ఫొటోషాప్, యానిమేషన్ వంటి గ్రాఫిక్స్ రిలేటెడ్ అప్లికేషన్లపై కూడా తన 10వ ఏటకే అంటే 5వ తరగతి చదువుతున్నప్పుడే పట్టు సాధించాడు. దీంతో నిత్యం ఎక్కువ సేపు కంప్యూటర్‌పైనే అతను పనిచేసేవాడు. రోజూ స్కూల్ నుంచి రాగానే కంప్యూటర్‌తో కుస్తీ పట్టేవాడు. ఈ క్రమంలో అనేక సాఫ్ట్‌వేర్ కోర్సులను సొంతంగా నేర్చుకుని వాటిపై పట్టుసాధించాడు కూడా.
అలా విష్ణు కంప్యూటర్ సాఫ్ట్‌వేర్లపై ప్రయోగాలు చేస్తూ ఇప్పుడు 8వ తరగతికి చేరుకున్నాడు. ఈ క్రమంలో అతను నిత్యం ఆడుతున్న గేమ్స్ బోర్ కొట్టాయో ఏమో గానీ సొంతంగానే తానే 9 రకాల ఆండ్రాయిడ్ గేమ్స్‌ను క్రియేట్ చేశాడు. కలరింగ్, మ్యాచ్ మి, రంగోలి, ట్రేస్, షూట్ ఇట్, గెట్ ది టార్గెట్ వంటి ఆటలను విష్ణు రూపొందించి అనంతరం గూగుల్ ప్లే స్టోర్‌లో వాటిని పెట్టాడు. ఈ క్రమంలో అతని ప్రతిభ గురించి తెలిసిన సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ వచ్చే ఏడాది మార్చి 8న కాలిఫోర్నియాలో జరగనున్న సదస్సుకు అతన్ని ఆహ్వానించింది. అంతేకాదు, అమెజాన్, శాంసంగ్ వంటి 30 ప్రముఖ కంపెనీలు అతనికి తగిన శిక్షణ ఇచ్చి మంచి ఉద్యోగం కల్పిస్తామని ముందుకు వచ్చాయి కూడా. అయితే విష్ణు మాత్రం తనకు సాఫ్ట్‌వేర్ కంపెనీ యాపిల్‌లో పనిచేయాలని ఉందని వెల్లడించాడు. అతని కలలు సాకారం కావాలని మనమూ ఆశిద్దాం..! అన్నట్టు ఇంకో విషయం… సాఫ్ట్‌వేర్ కోడింగ్‌లో మేథావిలా ప్రతిభ చూపుతున్నాడు కదా అని విష్ణును ఏ కార్పొరేట్ స్కూల్‌లో చదువుతున్నాడో అని భావించకండి. ఎందుకంటే అతను చదువుతుంది ప్రభుత్వ పాఠశాలలో. ఆ పాఠశాలలో చదువుతూ కూడా అంత చిన్న వయస్సులో ఏకంగా ఆండ్రాయిడ్ గేమ్స్ డెవలప్ చేశాడంటేనే అతని ప్రతిభ ఏంటో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అయితే అంతటి మేథావికి పాపం అమ్మ లేదు. 3 ఏళ్ల కిందటే చనిపోయింది. నాన్న, నాయనమ్మల సంరక్షణలో విష్ణు పెరుగుతున్నాడు. అయినా అతను దిగులు చెందకుండా జీవితంలో ఉన్నత స్థానాలను సాధించాలని ముందుకు దూసుకెళ్తున్నాడు. అతను ఆ స్థానాలకు ఎదగాలని బెస్ట్ ఆఫ్ లక్ చెబుదాం..!
No comments:
Post a Comment