Saturday, February 20, 2016

ప్రపంచంలో ఇలాంటి మంత్రిత్వశాఖ ఎక్కడైనా ఉందా..!


అబుదాబీ: రాజకీయ నాయకులు ఎన్నికల్లో పోటీ చేసేముందు తాము ప్రజల ప్రజల సంతోషం కోసం అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ వాగ్దానాలు చేస్తుంటారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ హామీలను పక్కనపెట్టడం వారికి అలవాటే. అయితే, ప్రపంచంలోనే తొలిసారిగా  యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లో ఈ పరిస్థితులు మరోలా కనిపిస్తున్నాయి. ప్రజల సంతోషమే తమ ధ్యేయంగా భావించిన యూఏఈ ప్రభుత్వం అందుకు తగినట్లుగా ప్రణాళికలు రూపొందించింది. అందులో భాగంగానే ప్రపంచంలోనే మనం ఎప్పుడు వినని విధంగా ఆ దేశ మంత్రివర్గంలో సంతోషం అనే నూతన శాఖను ఏర్పాటు చేశారు. ప్రజల మంచి కోసం కొత్తగా హ్యాపీనెస్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశామని యూఏఈ ప్రధాని, దుబాయ్ పాలకుడు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తెలిపారు. దీంతో కేబినెట్ లో 29వ మంత్రికి చోటు కల్పించినట్లయింది.

ప్రస్తుతం ఈ విషయం ప్రపంచం దృష్టిని యూఏఈ వైపు మరచ్చి ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఒహుద్ అల్ రౌమీ అనే మహిళ నూతనంగా కేబినెట్ లో చోటు కల్పించిన సంతోషశాఖకు మంత్రిగా వ్యవహరించనున్నారు. ఈ వారంలో ఆమె భాద్యతలు చేపట్టే అవకాశాలున్నాయి. అదేవిధంగా యువజనశాఖకు ఆక్స్ ఫర్డ్ నుంచి 22 ఏళ్లకే మాస్టర్స్ డిగ్రీ సాధించిన షమ్మా అల్ మజౌరీని మంత్రిగా నియమించారు. 29 మంది మంత్రుల్లో రౌమీ చేరికతో మహిళా మంత్రుల సంఖ్య ప్రస్తుతం ఎనిమిదికి చేరుకుంది. దేశ భవిష్యత్తు, యువతకు తోడ్పాడు, ప్రజల సంతోషం, ఉన్నత విద్య అంశాలలో మంచి ఫలితాలు సాధించేందుకు మినిస్టర్ ఆఫ్ హ్యాపినెస్ ను ఏర్పాటు చేశామని ప్రధాని తన ట్విట్టర్లో పేర్కొన్నారు.

ఇంటర్వ్యూ లేకుండానే ఫ్లిప్‌కార్ట్‌లో ఉద్యోగాలు!


న్యూఢిల్లీ : ఎంఎన్‌సీలలో ఉద్యోగాలు రావాలంటే చిన్న విషయం కాదు.  నాలుగైదు ఫేజులలో ఇంటర్వ్యూలు, హెచ్ఆర్ రౌండు.. ఇవన్నీ ఉంటాయి. కానీ, తొలిసారిగా ఫ్లిప్‌కార్ట్ సంస్థ ఇంటర్వ్యూలు లేకుండా ఉద్యోగాల్లోకి తీసుకుంటోంది. అయితే అందరినీ మాత్రం కాదు. ఉడాసిటీ వాళ్ల ప్రోగ్రాంలు పూర్తిచేసినవాళ్లనే ఇలా ఇంటర్వ్యూ ప్రసక్తి లేకుండానే ఉద్యోగంలోకి తీసుకోబోతున్నట్లు ప్రకటించింది. ఉడాసిటీ అనేది ఒక ఆన్‌లైన్ లెర్నింగ్ కంపెనీ. అందులో నానో డిగ్రీ ప్రోగ్రాంలు నిర్వహిస్తారు. ఇవి పూర్తి చేసిన వాళ్లకు వ్యక్తిగత ఇంటర్వ్యూలు గానీ, గ్రూప్ డిస్కషన్లు గానీ ఏమీ అక్కర్లేదని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.

దీంతో నియామకాల విషయంలో చేయాల్సిన భారీ కసరత్తు తగ్గిపోతుందని, చాలా సమయం ఆదా అవుతుందని చెబుతున్నారు. పరిశ్రమకు కావల్సిన అవసరాలేంటో ముందుగానే తెలుసుకుని ఆ ప్రకారమే విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం ద్వారా వారిని ఉద్యోగాలకు సిద్ధంగా చేయడం.. తద్వారా వాళ్లు నేరుగా ఉద్యోగాల్లో ప్రవేశించడం సాధ్యం అవుతున్నాయి. ఇలా ఇప్పటికే ముగ్గురు విద్యార్థులను ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగాల్లోకి తీసుకోగా, వాళ్లు మొబైల్ డెవలప్‌మెంట్ టీమ్‌లో పనిచేయడం ప్రారంభించారు.

కావలి కనకపట్నం దిశగా నియోజకవర్గాల పునర్విభజన లో కావలి నియోజకవర్గం ఆవిష్కరణ

*

* నియోజకవర్గాల పునర్విభజన లో కావలి నియోజకవర్గం షేపు మారడం ఖాయం.

* కొత్త కావలి నియోజకవర్గం బౌండరీల విషయంలో... రకరకాల ఊహాగానాలు.... ప్రచారాలు... విస్తృతంగా జరుగుతోంది.

* కొత్త కావలి నియోజకవర్గం ఆ మండలం ఉంటుంది.... ఈ మండలం ఉంటుంది... అంటూ... ప్రచారం చేసే వారు.... మీడియా ను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు.

* ఇలా ప్రచారం వల్ల.... అలా ప్రచారం చేసేవారికి.... ఏమిటి ప్రయోజనం అనే ప్రశ్న తలెత్తుతుంది..

* రాజకీయాలు ఎప్పుడూ కూడా.... ప్రచారాలతోనే.... బిజీగా ఉంటాయి.

* తమను అనుసరిస్తున్న వారిపై పట్టుకోల్పోకుండా.... తమ నుంచి జారిపోకుండా ఉండేందుకే... ఈ ప్రచార ఎత్తుగడలను రాజకీయ నాయకులు ఆశ్రయిస్తుంటారు.

* ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు.... రైతు రుణాలు, పొదుపు సంఘాల రుణాలు మాఫీ అన్నారు.  ఆయన సీఎం అయిన తర్వాత... ఈ రుణాలు మాఫీ విషయం లో ఆయనకు ఉన్న ఇబ్బందులు దృష్ట్యా ఏం చేశారో.... అందరికీ తెలిసిందే.

* అతెందుకు... కాపులకు ఏడాదికి వెయ్యి కోట్ల రూపాయలు, కాపు లను బీసీ చేస్తామని చెప్పారు.... రెండేళ్ల గాని.... ఆ సంగతి పట్టించుకోలేదు. పట్టించుకున్నా... పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నాం.

* నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి... ఢిల్లీ లో చేరి... 'నేను మాట్లాడాల్సిన వాళ్లతో మాట్లాడాను. నియోజకవర్గాల పునర్విభజన జరగదు. జరుగుతుందని.. పని లేని చంద్రబాబు... విజయవాడ లో చేరి... ఈ సారి ఎమ్మెల్యే ల సీట్లు పెరుగుతున్నాయ్... టీడీపీ లో చేరిన వారందరికీ సీట్లు ఇస్తామని... గోబుల్స్ ప్రచారం చేస్తున్నాడు' అని అన్నారు.

* కానీ... ఎవరైతే జోక్యం చేసుకుంటే... నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందో... ఆయనే స్వయంగా.... అంటే కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు... జరుగుతుందని ప్రకటించారు.

* ఇలా రాజకీయ నాయకులు.... తమకు అనుకూలంగా ప్రచారం చేసుకోవడం... మంచి నీళ్లు తగినంత ఈజీ.

* సో..... ఈ సోదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.... రాజకీయ నాయకులు.... ఏ విషయాన్నైనా... చాలా సింపుల్ గా... జనం నిజం అనుకుని నమ్మేలా.... ప్రచారం చేయగలరు. చేయించగలరు.

* ఆ విధంగానే కావలి అసెంబ్లీ నియోజకవర్గం.... కొత్త హద్దులు విషయం లో కూడా అదే చేస్తున్నారు.

* కాని... ఎవరెన్ని ప్రచారాలు చేసినా... కొత్త కావలి నియోజకవర్గం... లో.... కావలి టౌన్, కావలి రూరల్, బోగోలు, జలదంకి మండలాలు మాత్రమే ఉంటాయి.

* ఈ కొత్త నియోజకవర్గంలో.... కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి కి అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందని.... అన్నీ పార్టీల్లోనూ.... విపరీతమైన చర్చలు జరుగుతున్నాయి.

* కావలి ప్రాంత ప్రజల్లో ఫ్రెండ్లీ పొలిటీషియన్ గా.... క్లీన్ ఇమేజ్ ఉన్న వంటేరు వేణుగోపాల్ రెడ్డి సొంత మండలం జలదంకి.

*  సో.... ఆయనే ఈ సారి అభ్యర్థి అయితే మాత్రం.... ప్రత్యర్ధి ... ఈ మండలంలో చుక్కలు చూడాల్సి ఉంటుంది. అంటే... వంటేరు వేణుగోపాల్ రెడ్డి.... కోసం ఆ మండల ప్రజలు.... ఆతృతతో ఎదురుచూస్తున్నారు.

* ఇక కావలి రూరల్ మండలం లో... ప్రతి గ్రామంలో పది మందిని పేర్లు పెట్టి పిలిచే... అటాచ్ మెంట్... ఉంది వంటేరు కు.

* వంటేరు ను ఒక రాజకీయ నాయకుడు గా కాకుండా, తమ ఆత్మీయుడనే అభిప్రాయం... కావలి రూరల్ మండల ప్రజల ది.

* బోగోలు మండలం లో.... ఆయనకు విస్తృతంగా వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి. ఇక ఆయన సన్నిహితులు.... చాప కింద నీరులా.... పకడ్బందీగా.... వంటేరు కు అనుకూలంగా రాజకీయ వాతావరణం ఏర్పరచడానికి...... ప్రతి పంచాయతీ లో స్ట్రాంగ్ మాస్టర్ ప్లాన్ లు వేసి ఉన్నారు.

* మిగిలింది కావలి పట్టణం.  అభివృద్ధి విషయంలో పటిష్టమైన విజన్ వంటేరు వేణుగోపాల్ రెడ్డి సొంతం అనే ఇమేజ్... కావలి టౌన్ ప్రజల్లో ఉంది. 

* కావలి డెవలప్ మెంట్ ట్రెండ్ సెట్టర్  వంటేరు తో స్వతంత్రంగా మువ్ కావచ్చని..... అందరితో ఫ్రీ గా కలిసిపోయే వ్యక్తిత్వం వంటేరు ప్రత్యేకత అనేది... కావలి పట్టణ ప్రజల్లో ఉన్న బలమైన అభిప్రాయం.

* కావలి లో  పార్టీలకు అతీతంగా క్యాడర్ వంటేరు వేణుగోపాల్ రెడ్డి... ఈ సారి కావలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే విషయంపై సానుకూలంగా చర్చించుకుంటున్నారు.

* ఆయన మాత్రం.... భవిష్యత్తు రాజకీయాలు గురించి....  ఒక్క మాట కూడా చెప్పడం లేదు.

* ఏది ఏమైనా.... ఈ సారి కావలి నియోజకవర్గం లో వంటేరు వేణుగోపాల్ రెడ్డి .... కీలకమైన పాత్ర పోషించడం ఖాయం.

* అయితే ఆ కీలకమైన పాత్ర స్వభావం ఎలా ఉంటుంది...?  వంటేరు వేణుగోపాల్ రెడ్డి... వ్యక్తిగతంగా తీసుకోబోయే చొరవ... తదితర అంశాలు గురించి క్లారిటీ రావాల్సి ఉంది.

* అప్పుడెప్పుడో.... అంటే.. 12 ఏళ్ల క్రితం.... ..( 2004 సంవత్సరం)..... ముందు రాజకీయంగా.... పదేళ్ల పాటు అంటే.... 1994 - 2004 కాలంలో... కావలి ప్రాంత ప్రజలతో వంటేరు వేణుగోపాల్ రెడ్డి మమేకమైన తీరు ను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.

* రాజకీయంగా 12 ఏళ్ల తర్వాత.... ఇప్పుడు కూడా.. ఆయన '' తిరుగులేని రాజకీయ శక్తి '' గా ప్రజల మనస్సుల్లో ఉన్నారంటేనే.... వంటేరు... మంచితనం ఏమిటో చెప్పకనే చెబుతుంది.

ఆంధ్ర ప్రదేశ్ లో కులపిచ్చి బాగా పెరగానికి ప్రధాన కారణాలు ఏంటంటే..



1. అస్తిత్వం కోసం కులం

దాదాపు ప్రతి ఒక్కరికి తమ కులం మీద అభిమానం; తమ కులం గొప్పదనో, లేదా అణచివేయబడ్డది అనో ఒక అభిప్రాయం ఉంటుంది. తనని మిగతా సమాజంతో కలిపే వేరే ఏ వేదిక బలంగా లేనప్పుడు, తరతరాలుగా బలంగా ఉన్న కులం అనేదే ఆకర్షిస్తుంది. తమ కులంలో పుట్టిన వ్యక్తులు సాధించిన విజయాల్ని తమ కులపు విజయాలుగా చెప్పుకోవడం, ఆరాధన పెంచుకోవడం జరుగుతుంది. ఇప్పుడు భీమవరంలో జరిగింది అలాంటిదే. ఎంతో కాలంగా సినిమా రంగంలో కమ్మ లేదా కాపు కులానికి చెందిన వారు మాత్రమే నంబర్-1 గా ఉన్నారు. క్షత్రియుడైన ప్రభాస్ ‘బాహుబలి’ ద్వారా మొదటి సారి నంబర్ 1 రేసులో ముందుకు వచ్చాడు. దీంతో, భీమవరంలో ఉన్న రాజులు ‘బాహుబలి’ రిలీజ్ ని కనీవినీ ఎరుగని రీతిలో ఓ పెద్ద పండుగ లాగా చేశారు. ‘బాహుబలి’ విజయం తర్వాత భీమవరంలో కొందరు హార్డ్ కోర్‌ ప్రభాస్ అభిమానులు తమ హీరో గురించి  చేసుకుంటున్న ప్రచారం  తెలుగులో నంబర్- 1 పవన్ కల్యాణ్ మాత్రమే అని నమ్మే పవన్ అభిమానులకు ఏ మాత్రం నచ్చలేదు. ఇదే క్రమంలో, ప్రభాస్ అభిమానులకు పోటీగా సెప్టెంబర్‌ 2 న పవన్ పుట్టినరోజును  భీమవరంలో భారీగా చేశారు. ఇక్కడే ఇరు వర్గాల మధ్య ఈగో సమస్యలు, రాజకీయాలు అన్నీ కలిసి పెద్ద వివాదంగా మారి ఘర్షణలకి దారి తీశాయి.

2.ఉమ్మడి అవసరాలు లేకపోవడం

ప్రస్తుతం మన సమాజంలో ఉమ్మడి అవసరాలు బాగా తగ్గిపోయాయి. మంచి నీళ్ళు సమస్య ఉంటే మినరల్ వాటర్ కొనుక్కుంటాం, గవర్నమెంట్  స్కూల్ బాగా లేకపోతే ప్రైవేటు స్కూల్ కి పంపించుకుంటాం. ప్రభుత్వ వైద్యం సరిగా లేకపోతే కార్పోరేట్ ఆసుపత్రికి వెళతాం, కరెంట్ సమస్య ఉంటే ఇన్వర్టర్ కొనుక్కుంటాం.., ఇలా రోడ్డు, శానిటేషన్, లా అండ్ ఆర్డర్ తప్ప మనిషి ప్రతి అవసరానికి  ప్రత్యామ్నాయాలు వచ్చేసాయి. కాబట్టి కలిసి మాట్లాడుకోవడం, అందరూ కలిసి సమస్యలని పరిష్కరించుకోవడం అనే అలవాటు తప్పిపోయింది. ఉమ్మడి అవసరాలు ఉండి ఉంటె ఎప్పుడో ఒకసారి అయినా కలిసిపోతారు. ఇప్పుడా అవసరం లేకుండా పోయింది. దీంతో, సమాజంలో అన్ని వర్గాలు కలిసి మాట్లాడుకుని, చర్చించుకునే సమష్టి తత్త్వం పూర్తిగా తగ్గిపోయింది.

3.సమస్యలతో సహజీవనం అలవాటు పడిపోవడం

వ్యవసాయం నష్టాలు రావడం, యువతకి ఉద్యోగాలు లేకపోవడం లాంటి కొన్ని సమస్యలు ఉన్నా కాని, వాటికి పరిష్కారాలు ఏమీ కనిపించడం లేదు, అనాదిగా ఉన్న సమస్యలు కాబట్టి వాటికి అలవాటు కూడా పడిపోయాం. అందుకే రైతు సంఘాలు కాని, నిరుద్యోగ సంఘాలు కాని బలంగా లేవు. ఈ సమస్యల మీద ఉద్యమాలు చేసే పరిస్థితి కూడా ఉండటం లేదు.

4.కొత్త ఉద్యమం ఏదీ లేకపోవడం

కులాల సమస్య మన దేశంలో ఎప్పటి నుండో ఉన్నా, గతంలో కొన్ని ఉద్యమాలు రావడం వల్ల, కొత్త ఆలోచనలు రావడం వల్ల కులాల అడ్డుగోడలు కొంతైనా తగ్గాయి. ఉదాహరణకి కమ్యూనిస్ట్ పార్టీల ప్రభావం, నాస్తికోద్యమం, హేతువాద ఉద్యమం లాంటి వాటి వల్ల కులాంతర వివాహాలు, అన్ని కులాలు కలిసి పోరాటం చేయడం లాంటివి జరిగాయి. కమ్యూనిస్ట్ భావాజాలనికి కాలం చెల్లడం, కమ్యూనిస్ట్ పార్టీల్లో కూడా కులతత్వం పెరగడం వల్ల 1980 ల నాటికే ఈ ఆదర్శాలు తగ్గుముఖం పట్టాయి.. ఆ తర్వాత వచ్చిన లోక్ సత్తా ఉద్యమం కారణంగా యువత కులాలకి అతీతంగా ఆలోచించడం, కలిసి పని చేయడం మొదలయింది. అయితే లోక్ సత్తా ఉద్యమం 9 ఏళ్లకే రాజకీయ రంగు పులుముకోవడం, ఆ తర్వాత విఫలం అవడంవల్ల, లోక్ సత్తా కారణంగా సామాజిక మార్పులు ఏమీ జరగలేదు. లోక్ సత్తా తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కొత్త భావజాలం ఏదీ రాలేదు. తెలంగాణ లాంటి బలమైన ఎమోషనల్ అంశం తెరమీదకి వచ్చినప్పుడు మాత్రం తెలంగాణలో అన్ని కులాలు కలసి పోరాటం చేశాయి. కులం అనే చిన్న గీత పక్కన, మరో సమస్య ఓ పెద్ద గీతలా కనిపించినప్పుడు కులపిచ్చి కాస్త తగ్గుతుంది. ఆంధ్రప్రదేశ్ లో అలాంటి పెద్ద గీత ఏమీ లేకపోవడం కులపిచ్చి పెరగడానికి మరో కారణం.

5.రాజకీయ, సామజిక ఎదుగుదలకి కులం

ొత్త భావజాలం ఏదీ లేనప్పుడు, కొత్త ఆలోచనలు ఏమీ లేనప్పుడు, జనాన్ని సమీకరించుకోవడానికి కులం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. రాజకీయంగా లేదా సోషల్ స్టేటస్ పరంగా ఎదగాలి అని కోరుకునేవాళ్ళు తమ కులస్తులని పోగెయ్యడం, వనభోజనాలు పెట్టడం, సత్రాలు కట్టించడం, తమ కులంలోని పేదల పెళ్ళిళ్ళకి ఆర్థిక సహాయం చేయడం లాంటి కార్యక్రమాలు చేయడం మొదలు పెట్టారు. రాజకీయ ఎదుగుదల కోసం కులాన్ని వాడుకోవడం, కులాల మధ్య వివాదాలు సృష్టించడం, కులాలకి రిజర్వేషన్ల కోసం ఉద్యమించడం.. ఇలా, ఇటీవల కాలంలో కులం అనేది మళ్ళీ బలపడింది. ఆఖరికి అమెరికాలో 50 రాష్ట్రాల్లో స్ప్రెడ్ అయిన తెలుగు వాళ్ళు కూడా కులాల ప్రాతిపదికనే సంఘాలు పెట్టుకుంటున్నారు.

6. గ్రామాల్లో ఉన్న పాత కక్షలు

ఓ గ్రామంలో కాపు కమ్మ కులాల మధ్య వివాదం ఉందనుకోండి. ఆ గ్రామంలో ఆ కులాలలో పుట్టిన చాలా మంది ఆపోజిట్ కులం అంటే వ్యతిరేకతతోనే పెరుగుతారు. ఆ కుల వ్యతిరేకత హైదరాబాద్ వెళ్ళినా పోదు, అమెరికా వెళ్ళినా పోదు. ఇలా ఇంకో గ్రామంలో కాపులు రాజులకి మధ్య వివాదం, మరో గ్రామంలో కమ్మ రెడ్లు మధ్య వివాదం ఇలా ఉంటుంటాయి. గ్రామాల్లో అగ్రవర్ణాలు, దళితుల మధ్య ఉండే వివాదాలు.. ఇవన్నీ కలిసి రాష్ట్ర స్థాయిలో కొన్ని సమూహాల అభిప్రాయాలుగా మారతాయి. ఆ కులాలు ఆ సమూహం అభిప్రాయాలనే తమ అభిప్రాయాలుగా భావిస్తుంటాయి. ఇలా గ్రామస్థాయిలో ఉన్న వివాదాలు, కక్షలు రాష్ట్ర, జాతీయ స్థాయిదాకా ప్రతిబింబిస్తుంటాయి.
ఈ ఆరు కారణాలుగా ఆంధ్రప్రదేశ్ లో కులపిచ్చి బాగా పెరిగి పెట్రేగిపోతోంది. పెరుగుతున్న కులపిచ్చి కారణంగా ప్రజల సమస్యలు మరుగున పడిపోతున్నాయి. తప్పును తప్పు అని చెబితే ఏ కులానికి కోపం వస్తుందో అని భయపడే పరిస్థితి వచ్చింది. అవినీతిని ప్రశ్నిస్తే ఏం మీ కులం వాళ్ళు తినలేదా అని ఎదురుదాడికి దిగే దుస్థితి నెలకొంది. రాష్ట్ర భవిష్యత్తుకి ఏది మంచిది ఏది మంచిది కాదు అనే చర్చకి ఆస్కారం లేకుండా పోతోంది. ఇది రాష్ట్రానికి చాలా ప్రమాదకరం. యువత మేలుకోకపోతే, కులపిచ్చి వదిలించుకోకపోతే ఆంధ్రప్రదేశ్ సింగపూర్ కావడం కాదు, ఓ బీహార్, ఉత్తరప్రదేశ్ లాగా మారిపోవడం ఖాయం.

Friday, February 19, 2016

కేరళ ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్‌కే పట్టం

* అధికార యూడీఎఫ్‌కు ఎదురు దెబ్బ
* తొలిసారి ఖాతా తెరవనున్న బీజేపీ
* ది ఆసియానెట్ న్యూస్ పోల్ సర్వే

న్యూఢిల్లీ: రానున్న కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో (ఏప్రిల్ లేదా మేలో జరిగే) అధికారంలోవున్న యూడీఎఫ్ గెలుస్తుందా లేక ప్రతిపక్ష ఎల్‌డీఎఫ్ గెలుస్తుందా? ఇంతవరకు ఒక్క సీటును కూడా దక్కించుకోని బీజేపీ ఈసారైనా ఖాతా తెరుస్తుందా? తెరిస్తే ఎన్ని సీట్లు వస్తాయి? అన్న అంశాలపై అప్పుడే సర్వేలు ప్రారంభమయ్యాయి. ‘ది ఆసియా నెట్ న్యూస్- సీ ఫర్ సర్వే’లు ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి ఫిబ్రవరి 16వ తేదీ వరకు 70 నియోజక వర్గాల్లో సర్వేచేసి ఫలితాలను విడుదల చేసింది.

ఆ సర్వే ప్రకారం అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయిన అధికార పక్షం యూడీఎఫ్ ఈసారి దెబ్బపడి ప్రతిపక్షానికి పరిమితం అవుతుంది. ప్రస్తుతం ప్రతిపక్షమైన ఎల్‌డీఎఫ్ 77 నుంచి 82 వరకు సీట్లు వస్తాయి. యుడీఎఫ్‌కు 55 నుంచి 60 సీట్లు వస్తాయి. బీజేపీ మొదటిసారిగా కేరళ అసెంబ్లీలో ఖాతా తెరచి మూడు సీట్ల నుంచి ఐదు సీట్ల వరకు సాధిస్తుంది. ఎల్‌డీఎఫ్‌కు 41 శాతం, యూడీఎఫ్‌కు 37 శాతం, బీజేపీకి 18 శాతం ఓట్లు వస్తాయి. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉన్నప్పటికీ ఎల్‌డీఎఫ్‌కు గతంలోకన్నా తక్కువ శాతం ఓట్లు పోలవడం. 2011లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్‌కు 44.94 శాతం ఓట్లు రాగా, ఈసారి 37 శాతమే ఓట్లు వస్తాయని సర్వే అంచనాలు తెలియజేస్తున్నాయి.

రెండు ఫ్రంట్‌ల ఓట్ల శాతాన్ని బీజేపీ దెబ్బతీస్తుంది. 2011లో బీజేపి కేవలం 6.03 శాతం ఓట్లను దక్కించుకోగా ఈసారి బీజేపీ కూటమికి 18 శాతం ఓట్లు వస్తాయని అంచనాలు తెలియజేస్తున్నాయి. సోలార్ స్కామ్ యూడీఎఫ్‌ను భారీగా దెబ్బతీస్తుందని 65 శాతం మంది ఓటర్లు భావిస్తున్నారు. ఈ స్కామ్ నిజమేనని అందులో 57 శాతం మంది ఓటర్లు విశ్వససిస్తున్నారు.

వైసిపి కి భూమా నాగిరెడ్డి సాక్

భూమా నాగిరెడ్డి,  ఆయన కుమార్తె అఖిల ప్రియ మరో ఇద్దరు వైసిపి ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు ఈరోజు తన ఆంతరంగికులతో జరిగిన సమావేశంలో భూమా నాగిరెడ్డి మాట్లాడుతూ తనకు కేబినెట్ మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారని వారికి తెలిపారు. సాయంత్రం నాలుగు గంటలకు జరగనున్న కార్యకర్తల సమావేశంలో ప్రకటన చేసే అవకాశం

Thursday, February 18, 2016

నెల్లూరు జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై మంత్రి, ఆనం స్కెచ్

నెల్లూరు జిల్లాలో 13కు పెరగనున్న అసెంబ్లీ స్థానాలు

అల్లూరు, రాపూరు, నెల్లూరు-3 ప్రతిపాదనలు

* రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 175 నియోజకవర్గాలు 225కు పెరగనున్నాయి.

* ఈప్రకారం జిల్లాలో మరో మూడు నియోజకవర్గాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.

* ప్రస్తుతం జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.

* నెల్లూరు పార్లమెంటు పరిధిలో ప్రకాశం జిల్లాకు చెందిన కందుకూరు నియోజకవర్గం కూడా ఉంది. ఇక ముందు దీన్ని తొలగించే అవకాశాలు ఉన్నాయని తెలసింది.

*  మరో మూడు నియోజకవర్గాలు పెంచి జిల్లాలో మొత్తం 13 ఏర్పాటు కానున్నాయి.

* రెవెన్యూ యంత్రాంగం నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనలపై కసరత్తు ప్రారంభించింది.

* ఓటర్లు, జనాభా, సామాజిక వర్గాల ప్రకారం విభజన తదితర అంశాలను క్రోడీకరిస్తున్నారు.

* సగటున 1.80లక్షల ఓటర్లు ఉండే విధంగా నియోజకవర్గానికి భౌగోళిక సరిహద్దులు నిర్ణయించనున్నారు.

*  నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఎలా ఉండబోతాయన్న అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

కొత్త ప్రతిపాదనలు ఇవే..!

* అనధికార వర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం జిల్లాలో కొత్తగా మరో మూడు నియోజకవర్గాలు నెల్లూరు-3, అల్లూరు, రాపూరు ఏర్పాటు కానున్నట్లు సమాచారం.

* ప్రస్తుతం కావలి నియోజకవర్గంలో ఉన్న మండలాలు అల్లూరు, బోగోలు, దగదర్తిలను విడదీసి అల్లూరు ఏర్పాటు చేయనున్నారని తెలిసింది.

* కావలి లోకి పక్కనే ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న జలదంకి, కలిగిరి చేర్చే అవకాశాలు ఉన్నాయి.

* కోవూరు నియోజకవర్గంలో ఉన్న ఇందుకూరుపేట విడదీసి నెల్లూరు గ్రామీణం మండలంలోని జనాభాతో కలిపి నెల్లూరు-3 నియోజకవర్గాన్ని ప్రతిపాదిస్తున్నారు.

* నెల్లూరు నగరం జనాభా ఇప్పటికే 6.50లక్షలు చేరింది. దీనికి గ్రామీణ, ఇందుకూరుపేట జనాభా కలిపితే దాదాపు 7.50లక్షలు చేరుతుంది. దీంతో నెల్లూరును మూడు నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలనేది ప్రతిపాదన.

* ప్రస్తుతం నెల్లూరు అర్బన్‌, నెల్లూరు గ్రామీణం పేర్లతో నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిని నెల్లూరు-1, నెల్లూరు-2గా పేర్లు మార్చే ప్రతిపాదన ఉంది.

* నగరం పరిధిలోని 54 డివిజన్లను మూడు నియోజకవర్గాలకు విభజించనున్నారు.

* నెల్లూరు-3లో తక్కువ డివిజన్లు ఉండే అవకాశాలు ఉన్నాయి.  ప్రస్తుతం తాజా ప్రతిపాదనల ప్రకారం కోవూరు లో ఉన్న ఇందుకూరుపేట మండలం నెల్లూరు-3కు రానుంది.

* కొత్తగా రాపూరు నియోజకవర్గం ఆవిర్భవించనుంది. రాపూరు, పొదలకూరు, కలువాయి, చేజర్ల మండలాలను చేర్చే ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలిసింది.

* సూళ్లూరుపేట నియోజకవర్గంలోనూ స్వల్ప మార్పులు చేసి ఒక మండలాన్ని వెంకటగిరిలో కలిపే అవకాశం ఉంది.

*  పురపాలక శాఖ మంత్రి నెల్లూరు-3పై దృష్టి పెట్టినట్లు ప్రచారం సాగుతోంది.

* ఇటీవలతెదేపాలో చేరిన ఆనం రామనారాయణ రెడ్డి తిరిగి రాపూరుకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. గతంలో ఆయన నాలుగు పర్యాయాలు అక్కడి నుంచి పోటీ చేశారు. రెండు సార్లు గెలిచారు.

ఈనాడు దినపత్రిక లో ప్రచురితమైన న్యూస్ ఇది.

* కొత్తగా 4 నియోజకవర్గాలు.... నెల్లూరు జిల్లా కు రావాలి.

* నాలుగవ నియోజకవర్గం పేరే.... వింజమూరు.

* నాయుడుపేట పేరుతో కొత్త నియోజకవర్గం రావాల్సి ఉంది.

* సరే... మంత్రి నారాయణ.... తన ఆసక్తి మేరకు.... నెల్లూరు 3 పేరుతో... ఒకటి,  మిగిలిన నెల్లూరు ను... నెల్లూరు 1,నెల్లూరు 2 అనే పేర్లతో.... నియోజకవర్గలను రూపొందిస్తున్నారనుకోవాలి.

* ఇక ఒకటి ఎస్టీ కి రిజర్వు కావాలి. 

* అలాగే ఇప్పటికే జిల్లాలో గూడూరు, సూళ్లూరుపేట లు ఎస్సీ లకు రిజర్వు అయి ఉన్నాయి.

* జిల్లా లో మరో స్థానం అంటే.... ఎస్సీ లకు మూడవ నియోజకవర్గ ను రిజర్వు చేయాలి.

ఈ అంశాలు.... గురించి కూడా ఆలోలించాల్సి ఉంది.

విశాఖలో పెట్రోలియం వర్శిటీకి కేంద్రం అంగీకారం


విశాఖ: విశాఖపట్నంలో పెట్రోలియం యూనివర్శిటీకి కేంద్రం అంగీకారం తెలిపింది. ఆంధ్రా యూనివర్శిటీ ప్రాంగణంలో ఈ ఏడాది నుంచి తరగతులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీని కోసం ఆంధ్రా యూనివర్శిటీతో కేంద్ర పెట్రోలియం శాఖ మూడేళ్లపాటు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

పెట్రోలియం వర్శిటీకి సంబంధించి ఈనెల 4వ తేదీన ఆంధ్రా యూనివర్శిటీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పెట్రోలియం శాఖ ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో పేర్కొన్నట్లుగానే పెట్రోలియం వర్శిటీని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. 2016-17 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించి ఈ ఏడాదిలోనే తరగతులు ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. అడ్మిషన్లు, తరగతుల నిర్వహణ, పరిపాలన ఇలా అన్ని ప్రక్రియలు మూడేళ్ల పాటు ఏయూ నుంచే నిర్వహించేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటనలో వెల్లడించింది. మూడు సంవత్సరాల్లో వర్శిటీకి సంబంధించి సొంత భవనాలు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకుని అక్కడికి తరలిస్తామని పెట్రోలియం శాఖ పేర్కొంది.

గూగుల్‌ను మించిపోయిన ఫ్రీడం....

ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది నిరంతరం శోధన చేసే గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌ను సైతం ఓ వెబ్‌సైట్‌ మించిపోయింది. రూ.251కే ఫోన్‌ అందిస్తామని ప్రకటించి సంచలనం సృష్టించిన రింగింగ్‌బెల్స్‌ కంపెనీ గురువారం నుంచి బుకింగ్స్‌ ప్రారంభిస్తామని తెలిపింది. దీంతో ఈ ఫ్రీడం ఫోన్‌ను కొనేందుకు దేశవ్యాప్తంగా విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో నెటిజన్లు ఉదయం నుంచి ఒక్కసారిగా రింగింగ్‌ బెల్స్‌ వెబ్‌సైట్‌కు లాగిన్‌ అవ్వడంతో విపరీతమైన రద్దీ నెలకొంది. దీంతో కొద్ది క్షణాల్లోనే ఈ వెబ్‌సైట్‌ సరికొత్త రికార్డు సృష్టించింది. ఫోన్లు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి, నిజంగా వస్తాయా.. అన్నది పక్కనబెడితే.. ఈ వెబ్‌సైట్‌ మాత్రం బాగా హిట్‌ అయ్యింది. గురువారం ఉదయం రిజిస్ట్రేషన్లు ప్రారంభమైన వెంటనే.. ఫ్రీడం 251 వెబ్‌సైట్‌కు సెకండ్‌కి ఆరు లక్షల హిట్స్‌ వచ్చాయి. అదే గూగుల్‌కు సెకండ్‌కి 40వేల హిట్లు వస్తాయి. అంటే గూగుల్‌తో పోలిస్తే.. ఫ్రీడమ్‌కు సెకండ్‌కు 15రెట్ల ఎక్కువ హిట్లు వచ్చాయన్నమాట.

ఇంత ఎక్కువ హిట్లు రావడంతో సర్వర్‌ ఆగిపోయిందని.. 24 గంటల్లో అప్‌గ్రేడ్‌ చేసి బుకింగ్‌ పునః ప్రారంభిస్తామని రింగింగ్‌బెల్స్‌ ప్రకటించింది. మరోవైపు రూ.251కే స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలనుకున్న యువత ఫోన్‌ బుక్‌ చేసుకునేందుకు ఎదురుచూస్తున్నారు.

‘ఫ్రీడమ్‌-251’ ఆర్డర్స్‌ నిలిపివేత

ప్రపంచంలోనే అత్యంత చౌకగా కేవలం రూ.251కే స్మార్ట్‌ఫోన్‌ని అందిస్తామంటూ ప్రకటించిన రింగింగ్‌ బెల్స్‌ కంపెనీ ఈరోజు తన ‘ఫీడ్రమ్‌-251’ ఫోన్‌ ఆర్డర్స్‌ని నిలిపివేసింది. ఈ ఫోన్‌ని కంపెనీ నిన్న అధికారికంగా ప్రారంభించగా.. నేటి నుంచి ఆర్డర్స్‌ స్వీకరిస్తామని ప్రకటించింది. అయితే.. ఈ ఆర్డర్స్‌ని 24గంటలపాటు నిలిపివేస్తున్నట్లు కంపెనీ ఇప్పుడు ప్రకటించింది.

ఎక్కువ మంది కంపెనీ వెబ్‌సైట్‌ ఓపెన్‌ చెయ్యడంతో ఓవర్‌లోడ్‌ అయ్యిందని అందుకే నిలిపివేస్తున్నట్లు కంపెనీ నిర్వాహకులు చెప్పారు. తమ కంపెనీ వెబ్‌సైట్‌కి కేవలం సెకను సమయంలో 6లక్షల హిట్స్‌ వచ్చాయని.. దీంతో ఓవర్‌లోడ్‌ అయ్యిందని కంపెనీ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. మరో పక్క ఈ చౌక స్మార్ట్‌ ఫోన్‌ వ్యవహారంపై సామాజిక మీడియాలో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.