1. అస్తిత్వం కోసం కులం
దాదాపు ప్రతి ఒక్కరికి తమ కులం మీద అభిమానం; తమ కులం గొప్పదనో, లేదా అణచివేయబడ్డది అనో ఒక అభిప్రాయం ఉంటుంది. తనని మిగతా సమాజంతో కలిపే వేరే ఏ వేదిక బలంగా లేనప్పుడు, తరతరాలుగా బలంగా ఉన్న కులం అనేదే ఆకర్షిస్తుంది. తమ కులంలో పుట్టిన వ్యక్తులు సాధించిన విజయాల్ని తమ కులపు విజయాలుగా చెప్పుకోవడం, ఆరాధన పెంచుకోవడం జరుగుతుంది. ఇప్పుడు భీమవరంలో జరిగింది అలాంటిదే. ఎంతో కాలంగా సినిమా రంగంలో కమ్మ లేదా కాపు కులానికి చెందిన వారు మాత్రమే నంబర్-1 గా ఉన్నారు. క్షత్రియుడైన ప్రభాస్ ‘బాహుబలి’ ద్వారా మొదటి సారి నంబర్ 1 రేసులో ముందుకు వచ్చాడు. దీంతో, భీమవరంలో ఉన్న రాజులు ‘బాహుబలి’ రిలీజ్ ని కనీవినీ ఎరుగని రీతిలో ఓ పెద్ద పండుగ లాగా చేశారు. ‘బాహుబలి’ విజయం తర్వాత భీమవరంలో కొందరు హార్డ్ కోర్ ప్రభాస్ అభిమానులు తమ హీరో గురించి చేసుకుంటున్న ప్రచారం తెలుగులో నంబర్- 1 పవన్ కల్యాణ్ మాత్రమే అని నమ్మే పవన్ అభిమానులకు ఏ మాత్రం నచ్చలేదు. ఇదే క్రమంలో, ప్రభాస్ అభిమానులకు పోటీగా సెప్టెంబర్ 2 న పవన్ పుట్టినరోజును భీమవరంలో భారీగా చేశారు. ఇక్కడే ఇరు వర్గాల మధ్య ఈగో సమస్యలు, రాజకీయాలు అన్నీ కలిసి పెద్ద వివాదంగా మారి ఘర్షణలకి దారి తీశాయి.
2.ఉమ్మడి అవసరాలు లేకపోవడం
ప్రస్తుతం మన సమాజంలో ఉమ్మడి అవసరాలు బాగా తగ్గిపోయాయి. మంచి నీళ్ళు సమస్య ఉంటే మినరల్ వాటర్ కొనుక్కుంటాం, గవర్నమెంట్ స్కూల్ బాగా లేకపోతే ప్రైవేటు స్కూల్ కి పంపించుకుంటాం. ప్రభుత్వ వైద్యం సరిగా లేకపోతే కార్పోరేట్ ఆసుపత్రికి వెళతాం, కరెంట్ సమస్య ఉంటే ఇన్వర్టర్ కొనుక్కుంటాం.., ఇలా రోడ్డు, శానిటేషన్, లా అండ్ ఆర్డర్ తప్ప మనిషి ప్రతి అవసరానికి ప్రత్యామ్నాయాలు వచ్చేసాయి. కాబట్టి కలిసి మాట్లాడుకోవడం, అందరూ కలిసి సమస్యలని పరిష్కరించుకోవడం అనే అలవాటు తప్పిపోయింది. ఉమ్మడి అవసరాలు ఉండి ఉంటె ఎప్పుడో ఒకసారి అయినా కలిసిపోతారు. ఇప్పుడా అవసరం లేకుండా పోయింది. దీంతో, సమాజంలో అన్ని వర్గాలు కలిసి మాట్లాడుకుని, చర్చించుకునే సమష్టి తత్త్వం పూర్తిగా తగ్గిపోయింది.
3.సమస్యలతో సహజీవనం అలవాటు పడిపోవడం
వ్యవసాయం నష్టాలు రావడం, యువతకి ఉద్యోగాలు లేకపోవడం లాంటి కొన్ని సమస్యలు ఉన్నా కాని, వాటికి పరిష్కారాలు ఏమీ కనిపించడం లేదు, అనాదిగా ఉన్న సమస్యలు కాబట్టి వాటికి అలవాటు కూడా పడిపోయాం. అందుకే రైతు సంఘాలు కాని, నిరుద్యోగ సంఘాలు కాని బలంగా లేవు. ఈ సమస్యల మీద ఉద్యమాలు చేసే పరిస్థితి కూడా ఉండటం లేదు.
4.కొత్త ఉద్యమం ఏదీ లేకపోవడం
కులాల సమస్య మన దేశంలో ఎప్పటి నుండో ఉన్నా, గతంలో కొన్ని ఉద్యమాలు రావడం వల్ల, కొత్త ఆలోచనలు రావడం వల్ల కులాల అడ్డుగోడలు కొంతైనా తగ్గాయి. ఉదాహరణకి కమ్యూనిస్ట్ పార్టీల ప్రభావం, నాస్తికోద్యమం, హేతువాద ఉద్యమం లాంటి వాటి వల్ల కులాంతర వివాహాలు, అన్ని కులాలు కలిసి పోరాటం చేయడం లాంటివి జరిగాయి. కమ్యూనిస్ట్ భావాజాలనికి కాలం చెల్లడం, కమ్యూనిస్ట్ పార్టీల్లో కూడా కులతత్వం పెరగడం వల్ల 1980 ల నాటికే ఈ ఆదర్శాలు తగ్గుముఖం పట్టాయి.. ఆ తర్వాత వచ్చిన లోక్ సత్తా ఉద్యమం కారణంగా యువత కులాలకి అతీతంగా ఆలోచించడం, కలిసి పని చేయడం మొదలయింది. అయితే లోక్ సత్తా ఉద్యమం 9 ఏళ్లకే రాజకీయ రంగు పులుముకోవడం, ఆ తర్వాత విఫలం అవడంవల్ల, లోక్ సత్తా కారణంగా సామాజిక మార్పులు ఏమీ జరగలేదు. లోక్ సత్తా తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కొత్త భావజాలం ఏదీ రాలేదు. తెలంగాణ లాంటి బలమైన ఎమోషనల్ అంశం తెరమీదకి వచ్చినప్పుడు మాత్రం తెలంగాణలో అన్ని కులాలు కలసి పోరాటం చేశాయి. కులం అనే చిన్న గీత పక్కన, మరో సమస్య ఓ పెద్ద గీతలా కనిపించినప్పుడు కులపిచ్చి కాస్త తగ్గుతుంది. ఆంధ్రప్రదేశ్ లో అలాంటి పెద్ద గీత ఏమీ లేకపోవడం కులపిచ్చి పెరగడానికి మరో కారణం.
5.రాజకీయ, సామజిక ఎదుగుదలకి కులం
ొత్త భావజాలం ఏదీ లేనప్పుడు, కొత్త ఆలోచనలు ఏమీ లేనప్పుడు, జనాన్ని సమీకరించుకోవడానికి కులం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. రాజకీయంగా లేదా సోషల్ స్టేటస్ పరంగా ఎదగాలి అని కోరుకునేవాళ్ళు తమ కులస్తులని పోగెయ్యడం, వనభోజనాలు పెట్టడం, సత్రాలు కట్టించడం, తమ కులంలోని పేదల పెళ్ళిళ్ళకి ఆర్థిక సహాయం చేయడం లాంటి కార్యక్రమాలు చేయడం మొదలు పెట్టారు. రాజకీయ ఎదుగుదల కోసం కులాన్ని వాడుకోవడం, కులాల మధ్య వివాదాలు సృష్టించడం, కులాలకి రిజర్వేషన్ల కోసం ఉద్యమించడం.. ఇలా, ఇటీవల కాలంలో కులం అనేది మళ్ళీ బలపడింది. ఆఖరికి అమెరికాలో 50 రాష్ట్రాల్లో స్ప్రెడ్ అయిన తెలుగు వాళ్ళు కూడా కులాల ప్రాతిపదికనే సంఘాలు పెట్టుకుంటున్నారు.
6. గ్రామాల్లో ఉన్న పాత కక్షలు
ఓ గ్రామంలో కాపు కమ్మ కులాల మధ్య వివాదం ఉందనుకోండి. ఆ గ్రామంలో ఆ కులాలలో పుట్టిన చాలా మంది ఆపోజిట్ కులం అంటే వ్యతిరేకతతోనే పెరుగుతారు. ఆ కుల వ్యతిరేకత హైదరాబాద్ వెళ్ళినా పోదు, అమెరికా వెళ్ళినా పోదు. ఇలా ఇంకో గ్రామంలో కాపులు రాజులకి మధ్య వివాదం, మరో గ్రామంలో కమ్మ రెడ్లు మధ్య వివాదం ఇలా ఉంటుంటాయి. గ్రామాల్లో అగ్రవర్ణాలు, దళితుల మధ్య ఉండే వివాదాలు.. ఇవన్నీ కలిసి రాష్ట్ర స్థాయిలో కొన్ని సమూహాల అభిప్రాయాలుగా మారతాయి. ఆ కులాలు ఆ సమూహం అభిప్రాయాలనే తమ అభిప్రాయాలుగా భావిస్తుంటాయి. ఇలా గ్రామస్థాయిలో ఉన్న వివాదాలు, కక్షలు రాష్ట్ర, జాతీయ స్థాయిదాకా ప్రతిబింబిస్తుంటాయి.
ఈ ఆరు కారణాలుగా ఆంధ్రప్రదేశ్ లో కులపిచ్చి బాగా పెరిగి పెట్రేగిపోతోంది. పెరుగుతున్న కులపిచ్చి కారణంగా ప్రజల సమస్యలు మరుగున పడిపోతున్నాయి. తప్పును తప్పు అని చెబితే ఏ కులానికి కోపం వస్తుందో అని భయపడే పరిస్థితి వచ్చింది. అవినీతిని ప్రశ్నిస్తే ఏం మీ కులం వాళ్ళు తినలేదా అని ఎదురుదాడికి దిగే దుస్థితి నెలకొంది. రాష్ట్ర భవిష్యత్తుకి ఏది మంచిది ఏది మంచిది కాదు అనే చర్చకి ఆస్కారం లేకుండా పోతోంది. ఇది రాష్ట్రానికి చాలా ప్రమాదకరం. యువత మేలుకోకపోతే, కులపిచ్చి వదిలించుకోకపోతే ఆంధ్రప్రదేశ్ సింగపూర్ కావడం కాదు, ఓ బీహార్, ఉత్తరప్రదేశ్ లాగా మారిపోవడం ఖాయం.
No comments:
Post a Comment