Thursday, February 18, 2016

గూగుల్‌ను మించిపోయిన ఫ్రీడం....

ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది నిరంతరం శోధన చేసే గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌ను సైతం ఓ వెబ్‌సైట్‌ మించిపోయింది. రూ.251కే ఫోన్‌ అందిస్తామని ప్రకటించి సంచలనం సృష్టించిన రింగింగ్‌బెల్స్‌ కంపెనీ గురువారం నుంచి బుకింగ్స్‌ ప్రారంభిస్తామని తెలిపింది. దీంతో ఈ ఫ్రీడం ఫోన్‌ను కొనేందుకు దేశవ్యాప్తంగా విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో నెటిజన్లు ఉదయం నుంచి ఒక్కసారిగా రింగింగ్‌ బెల్స్‌ వెబ్‌సైట్‌కు లాగిన్‌ అవ్వడంతో విపరీతమైన రద్దీ నెలకొంది. దీంతో కొద్ది క్షణాల్లోనే ఈ వెబ్‌సైట్‌ సరికొత్త రికార్డు సృష్టించింది. ఫోన్లు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి, నిజంగా వస్తాయా.. అన్నది పక్కనబెడితే.. ఈ వెబ్‌సైట్‌ మాత్రం బాగా హిట్‌ అయ్యింది. గురువారం ఉదయం రిజిస్ట్రేషన్లు ప్రారంభమైన వెంటనే.. ఫ్రీడం 251 వెబ్‌సైట్‌కు సెకండ్‌కి ఆరు లక్షల హిట్స్‌ వచ్చాయి. అదే గూగుల్‌కు సెకండ్‌కి 40వేల హిట్లు వస్తాయి. అంటే గూగుల్‌తో పోలిస్తే.. ఫ్రీడమ్‌కు సెకండ్‌కు 15రెట్ల ఎక్కువ హిట్లు వచ్చాయన్నమాట.

ఇంత ఎక్కువ హిట్లు రావడంతో సర్వర్‌ ఆగిపోయిందని.. 24 గంటల్లో అప్‌గ్రేడ్‌ చేసి బుకింగ్‌ పునః ప్రారంభిస్తామని రింగింగ్‌బెల్స్‌ ప్రకటించింది. మరోవైపు రూ.251కే స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలనుకున్న యువత ఫోన్‌ బుక్‌ చేసుకునేందుకు ఎదురుచూస్తున్నారు.

‘ఫ్రీడమ్‌-251’ ఆర్డర్స్‌ నిలిపివేత

ప్రపంచంలోనే అత్యంత చౌకగా కేవలం రూ.251కే స్మార్ట్‌ఫోన్‌ని అందిస్తామంటూ ప్రకటించిన రింగింగ్‌ బెల్స్‌ కంపెనీ ఈరోజు తన ‘ఫీడ్రమ్‌-251’ ఫోన్‌ ఆర్డర్స్‌ని నిలిపివేసింది. ఈ ఫోన్‌ని కంపెనీ నిన్న అధికారికంగా ప్రారంభించగా.. నేటి నుంచి ఆర్డర్స్‌ స్వీకరిస్తామని ప్రకటించింది. అయితే.. ఈ ఆర్డర్స్‌ని 24గంటలపాటు నిలిపివేస్తున్నట్లు కంపెనీ ఇప్పుడు ప్రకటించింది.

ఎక్కువ మంది కంపెనీ వెబ్‌సైట్‌ ఓపెన్‌ చెయ్యడంతో ఓవర్‌లోడ్‌ అయ్యిందని అందుకే నిలిపివేస్తున్నట్లు కంపెనీ నిర్వాహకులు చెప్పారు. తమ కంపెనీ వెబ్‌సైట్‌కి కేవలం సెకను సమయంలో 6లక్షల హిట్స్‌ వచ్చాయని.. దీంతో ఓవర్‌లోడ్‌ అయ్యిందని కంపెనీ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. మరో పక్క ఈ చౌక స్మార్ట్‌ ఫోన్‌ వ్యవహారంపై సామాజిక మీడియాలో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.

No comments:

Post a Comment