* అధికార యూడీఎఫ్‌కు ఎదురు దెబ్బ
* తొలిసారి ఖాతా తెరవనున్న బీజేపీ
* ది ఆసియానెట్ న్యూస్ పోల్ సర్వే
న్యూఢిల్లీ: రానున్న కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో (ఏప్రిల్ లేదా మేలో జరిగే) అధికారంలోవున్న యూడీఎఫ్ గెలుస్తుందా లేక ప్రతిపక్ష ఎల్‌డీఎఫ్ గెలుస్తుందా? ఇంతవరకు ఒక్క సీటును కూడా దక్కించుకోని బీజేపీ ఈసారైనా ఖాతా తెరుస్తుందా? తెరిస్తే ఎన్ని సీట్లు వస్తాయి? అన్న అంశాలపై అప్పుడే సర్వేలు ప్రారంభమయ్యాయి. ‘ది ఆసియా నెట్ న్యూస్- సీ ఫర్ సర్వే’లు ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి ఫిబ్రవరి 16వ తేదీ వరకు 70 నియోజక వర్గాల్లో సర్వేచేసి ఫలితాలను విడుదల చేసింది.
ఆ సర్వే ప్రకారం అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయిన అధికార పక్షం యూడీఎఫ్ ఈసారి దెబ్బపడి ప్రతిపక్షానికి పరిమితం అవుతుంది. ప్రస్తుతం ప్రతిపక్షమైన ఎల్‌డీఎఫ్ 77 నుంచి 82 వరకు సీట్లు వస్తాయి. యుడీఎఫ్‌కు 55 నుంచి 60 సీట్లు వస్తాయి. బీజేపీ మొదటిసారిగా కేరళ అసెంబ్లీలో ఖాతా తెరచి మూడు సీట్ల నుంచి ఐదు సీట్ల వరకు సాధిస్తుంది. ఎల్‌డీఎఫ్‌కు 41 శాతం, యూడీఎఫ్‌కు 37 శాతం, బీజేపీకి 18 శాతం ఓట్లు వస్తాయి. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉన్నప్పటికీ ఎల్‌డీఎఫ్‌కు గతంలోకన్నా తక్కువ శాతం ఓట్లు పోలవడం. 2011లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్‌కు 44.94 శాతం ఓట్లు రాగా, ఈసారి 37 శాతమే ఓట్లు వస్తాయని సర్వే అంచనాలు తెలియజేస్తున్నాయి.
రెండు ఫ్రంట్‌ల ఓట్ల శాతాన్ని బీజేపీ దెబ్బతీస్తుంది. 2011లో బీజేపి కేవలం 6.03 శాతం ఓట్లను దక్కించుకోగా ఈసారి బీజేపీ కూటమికి 18 శాతం ఓట్లు వస్తాయని అంచనాలు తెలియజేస్తున్నాయి. సోలార్ స్కామ్ యూడీఎఫ్‌ను భారీగా దెబ్బతీస్తుందని 65 శాతం మంది ఓటర్లు భావిస్తున్నారు. ఈ స్కామ్ నిజమేనని అందులో 57 శాతం మంది ఓటర్లు విశ్వససిస్తున్నారు.
No comments:
Post a Comment