Thursday, February 18, 2016

*తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు!

కేంద్రన్యాయశాఖ మంత్రితో వెంకయ్యనాయుడు సంప్రదింపులు

*తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచే ప్రక్రియ వేగవంతమైంది. ఈ అంశంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడతోపాటు ఆ మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు సంప్రదింపులు జరుపుతున్నారు. 2019లో జరిగే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ స్థానాల సంఖ్య ఇప్పుడున్న 175 నుంచి 225కి, తెలంగాణలో ఇప్పుడున్న 119 నుంచి 153కి పెరగవచ్చని తెలుస్తోంది. తెలుగు మీడియాతో వెంకయ్యనాయుడు బుధవారం దిల్లీలో మాట్లాడారు. అసెంబ్లీసీట్ల పెంపుపై ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని 26వ సెక్షన్‌లో ప్రస్తావించారని, ఇరురాష్ట్రాల సీఎంలు కూడా ఈ అంశం పట్ల సానుకూలంగా ఉన్నారని.. ఈ నేపథ్యంలోనే ఒక తెలుగువ్యక్తిగా తాను దీనిపై శ్రద్ధ తీసుకున్నానని చెప్పారు. నియోజకవర్గాల పునర్విభజనపై 2026 వరకూ నిషేధం ఉన్నదని ఆయన గుర్తుచేశారు. అయితే.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ కొత్తరాష్ట్రాలు కాబట్టి, పార్లమెంటులో ఒక చట్టం ద్వారా అసెంబ్లీసీట్ల సంఖ్యను పెంచటం సాధ్యమేనన్నారు. మరోవైపు, పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలు, బిల్లులపై ఈనెల 22న అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.

* ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు, తెలంగాణలో కేసీఆర్ ఈ పాయింట్ ఆధారంగా కూడా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఆకర్షిస్తున్న నేపధ్యంలో ఈ వార్త ఆశావహులకు శుభవార్తే.

No comments:

Post a Comment